Sharukh Khan | బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 2న జరిగిన ఈ వేడుకలో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ఈ వేడుకను షారూఖ్ తన కుటుంబంతో కలిసి అలీబాగ్‌లోని తన విలాసవంతమైన ఫార్మ్‌హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తన చిలిపి చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆయన నటి రాణీ ముఖర్జీ (Rani Mukerji) తో కలిసి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో కరణ్ తెల్లటి దుస్తుల్లో రాణీ ముఖర్జీ బుగ్గపై ప్రేమగా ముద్దు పెడుతుండగా, రాణీ నవ్వుతూ కెమెరాకు పోజిచ్చింది.
ఫోటోలో షారూఖ్ కనిపించకపోయినా, ఆ వేదికలో నవ్వులు పూయించిన ఆ మోమెంట్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని ఇచ్చింది. పార్టీలో మరో హైలైట్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) ప్రదర్శించిన అద్భుతమైన డ్యాన్స్ షో. గోల్డ్ హాల్టర్-నెక్ డ్రెస్‌లో సన్నజాజి తీగలా మెరిసిన అనన్య, తన డ్యాన్స్ మూవ్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. చేతిలో డ్రింక్ పట్టుకుని ఎంజాయ్ చేస్తున్న ఆమె వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆమెను చూపిస్తూ కరణ్ జోహార్ సరదాగా “ఈ బాంబర్‌ను ఊహించాలా?” అంటూ కామెంట్ చేయడం నవ్వులు పూయించింది.
అలాగే దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan) షారూఖ్‌ను కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్న ఫోటో కూడా వైరల్‌గా మారింది. ప్రతీ సంవత్సరం షారూఖ్ తన పుట్టినరోజున మన్నత్ ఇంటి బాల్కనీలో ఉండి అభిమానులను పలకరించే ఆచారం కొనసాగిస్తున్నాడు. అయితే ఈసారి అలీబాగ్‌లో వేడుక జరపడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. ఇక పుట్టినరోజు వేడుకలతో పాటు షారూఖ్ తన తదుపరి చిత్రం ‘కింగ్ (King)’ టీజర్‌ను విడుదల చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో షారూఖ్‌తో పాటు ఆయన కూతురు సుహానా ఖాన్ (Suhana Khan), దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లావత్, సౌరభ్ శుక్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యాన్స్ ఇప్పుడు సుహానా ఖాన్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ చిత్రం 2026లో థియేటర్లలో విడుదల కానుంది.