Karan Johar | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పలువురు సినీ ప్రముఖులను ఒక్కసారిగా అన్‌ఫాలో చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, యువ నటి అనన్యా పాండే, హీరో కార్తీక్ ఆర్యన్, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాలతో పాటు కరీనా కపూర్, మలైకా అరోరా, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ వంటి సన్నిహితుల అకౌంట్లను కూడా ఆయన అన్‌ఫాలో చేశారు. ఈ మార్పులను గమనించిన నెటిజన్లు, అభిమానులు కరణ్ జోహార్‌కు వారి మధ్య ఏవైనా విభేదాలు వచ్చాయా అంటూ రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు.
అయితే ఈ వార్తలపై స్పందించిన కరణ్ జోహార్.. తానేమీ ఎవరితోనూ గొడవపడి అన్‌ఫాలో చేయలేదని, ఇదంతా కేవలం ఒక ‘డిజిటల్ డిటాక్స్’ (సోషల్ మీడియాకు దూరం కావడం) ప్రక్రియలో భాగమేనని క్లారిటీ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను గడిపే సమయాన్ని, వృథా అయ్యే శక్తిని తగ్గించుకోవడానికే అందరినీ అన్‌ఫాలో చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిని జాతీయ వార్తగా మార్చవద్దని, క్లిక్‌బైట్ కథనాల కోసం వేరే విషయాలు చూసుకోవాలని, ఇది చాలా చిన్న విషయమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కరణ్ జోహార్ దాదాపు అందరినీ అన్‌ఫాలో చేసినప్పటికీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అకౌంట్‌ను మాత్రం ఇంకా ఫాలో అవుతుండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం 17.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న కరణ్ జోహార్ ఖాతాలో ఫాలోయింగ్ లిస్ట్ 78కి పడిపోయింది.