Karan Arjun Movie Re Release | బాలీవుడ్ నుంచి వచ్చిన ఆల్‌టైం క్లాసిక్ సినిమాలలో కరణ్ అర్జున్ ఒకటి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హృతిక్ రోషన్ (Hrithik Roshan) తండ్రి రాకేష్ రోషన్ (Rakesh Roshan) దర్శకత్వం వహించాడు. ఇక ఇదే సినిమాకు హృతిక్ రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. 1995లో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం అందించడమే కాకుండా రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ సోదరులుగా నటించడంతో థియేటర్లకు క్యూ కట్టారు ప్రేక్షకులు.
అయితే ఈ సినిమాను 30 ఏండ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. నవంబర్ 22న ఈ సినిమాను 4కే వెర్షన్లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో మమతా కులకర్ణి, కాజోల్ హీరోయిన్లుగా నటించగా.. రాఖీ, అమ్రిష్ పురి కీలక పాత్రల్లో నటించారు.