Karnataka Cinema Price Cap | సినిమా టికెట్ ధరల విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ‘కాంతార'(హోంబలే ఫిలింస్) సినిమా నిర్మాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా టికెట్ ధరలపై పరిమితిని విధిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ ధర గరిష్టంగా రూ.200గా మాత్రమే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ‘కాంతార’ సినిమా నిర్మాతలు కోర్టుకెక్కినట్లు తెలుస్తుంది.
ప్రభుత్వం నిర్ణయించిన కొత్త నిబంధనల వలన పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటు, మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలు ఉండే సినిమాలను విడుదల చేయడం కష్టమవుతుందని దానివల్ల ఆదాయం తగ్గి మొత్తం సినీ పరిశ్రమపై చెడు ప్రభావం పడుతుందని హోంబలే ఫిల్మ్స్ వాదిస్తోంది. ఈ నిర్ణయం వల్ల సినిమా బాగా నడుస్తున్నప్పటికీ, భారీ చిత్రాలను నిర్మించడం లాభదాయకంగా ఉండదని ఆ సంస్థ పేర్కొంది. అయితే ఈ కేసుపై విచారణ సెప్టెంబర్ 16న కర్ణాటక హైకోర్టులో జరగనుంది. కాగా.. కోర్టు తీర్పు ఈ వివాదాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.
మరోవైపు కాంతార చాప్టర్ 1 చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేస్తే.. తక్కువ టికెట్ ధరలతో సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావని చిత్రబృందం భావిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి కొన్ని వర్గాలు స్వాగతించగా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి వర్గాలు తమ ఆదాయంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.