కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్ ఏ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తర్వాత రికార్డుల వేట దిశగా వెళ్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న మరో కన్నడ సినిమా కాంతార (kantara). రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించాడు.
యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ బ్యానర్ హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు. కాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. కాంతారలో వచ్చే వరాహ రూపం పాట తమ నవరసం సాంగ్‌కు కాపీ అని కేరళకు చెందిన బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జి (Thaikkudam Bridge) ఆరోపిస్తోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో తైక్కుడం బ్రిడ్జి ఓ పోస్ట్ పెట్టింది.
‘కాంతారకు తైక్కుడం బ్రిడ్జి ఏ రకంగానూ అనుబంధం కాదని మా శ్రోతలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. ఆడియో పరంగా చూస్తే.. మా ఐపీ ‘నవరసం’ , ‘వరాహ రూపం’ మధ్య తిరస్కరించలేని సారూప్యతలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా కాపీరైట్ చట్టాల ఉల్లంఘనే. మా దృక్కోణంలో ఇది ‘స్పూర్తి’ కాదు.. ‘దోపిడీ’ (కాపీ).. వివాదాస్పదమైనది..ఈ పాటను సినిమా క్రియేటివ్ టీమ్ సొంతంగా సృష్టించుకున్నట్టు ప్రచారం చేస్తుంది. అందువల్ల కాపీకి కారణమైన క్రియేటివ్ టీంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కంటెంట్‌పై హక్కులకు సంబంధించి ఎలాంటి అనుమతి లేదు.. ’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. మరి దీనిపై కాంతార మేకర్స్ ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.
కాంతార కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విడుదలైన ఈ చిత్రం తెలుగు వెర్షన్ కూడా మంచి టాక్‌తో భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తోంది. కాంతార చిత్రంలో సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, నవీన్ డీ పడ్లి, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. అంజనీష్ లోక్ నాథ్ కాంతార చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.