Kantara 2 | కాంతార 2 షూటింగ్లో విషాదం చోటు చేసుకుంది. కేరళకు చెందిన కపిల్ (32) అనే నటుడు ఉడుపి జిల్లాలోని కొల్లూరు సమీపంలో ప్రవహించే సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాంతారా 2 సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత కపిల్ తన స్నేహితులతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. అయితే, దురదృష్టవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. వెంటనే అక్కడున్న వారు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, కపిల్‌ను రక్షించలేకపోయారు. ఈ సంఘటనతో కాంతారా 2 చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మరోవైపు కొల్లూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాంతారా సీక్వెల్ అయిన కాంతారా 2 చిత్రం అక్టోబర్ 2025లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉడుపి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కొద్ది నెలల క్రితమే ఈ చిత్రంలోని జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఇలాంటి విషాదాలు చిత్ర యూనిట్‌ను కలచివేస్తున్నాయి.
మరోవైపు సౌపర్ణిక నది చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో లోతైన గుంతలు మరియు బలమైన నీటి ప్రవాహాలు ఉండటం వల్ల ప్రమాదకరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో నీటి ప్రవాహం మరింత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.