Kantara 2 | ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి నటించిన కాంతార చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార 2 రూపొందుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కాంతార 2 మొదలైనప్పటి నుండి ఆ మూవీకి సంబంధించి ఏదో ఒక విషాద వార్త వింటున్నాం. ఆ మధ్య బస్సు ప్రమాదం, అనంతరం ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ మరణించడం, ఇక ఇప్పుడు రాకేష్ పూజారి(34) గుండెపోటుతో మరణించడం చూసి ఏం జరుగుతుందని ముచ్చటించుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం కాంతార2లో చేస్తున్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ నీటిలో మునిగి మరణించాడు. కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లగా, నీటి లోతు తెలియక నదిలోకి దిగడంతో ఊపిరాడక అతను చనిపోయాడు. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ మరణించి ఉండవచ్చని ప్రచారం జరగగా, దానిని నిర్మాణ సంస్థ ఖండించింది. ఇక ఇప్పుడు కాంతార2లో కీలక పాత్ర పోషించిన నటుడు రాకేశ్ పూజారి (34) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. రాకేశ్ ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్ 3లో విజేతగా నిలిచి మంచి గుర్తింపు పొందారు. కన్నడ, తుళు భాషల్లో పలు చిత్రాలలో నటించి మెప్పించారు. కాంతార 2 చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఆయన ఇటీవలే పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరైన రాకేష్.. మెహిందీ ఫంక్షన్లో ఉన్నట్లుండి గుండె పోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే కన్నుమూశాడు. మెహందీ వేడుకలో దిగిన ఫొటోలని పోస్ట్ చేశాడు, అనంతరం సోదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇది జరిగిన కాసేపటికే రాకేష్ కన్నుమూశారు. కార్కల టౌన్ పోలీస్ స్టేషన్లో అసహజ మరణం కింద కేసు నమోదైంది. రాకేశ్ మృతి పట్ల కాంతార 2 హీరో రిషబ్ శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. మిత్రమా.. మళ్లీ జన్మించు అంటూ నటుడు రిషబ్ శెట్టి భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. కాంతారలో నీ పాత్ర, ఆ పాత్రలో నటించే క్రమంలో నీ ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటాయి. నీ లోటు ఎవరూ తీర్చలేనిది” అంటూ రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్ ద్వారా రాకేశ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.