Kantara Chapter 1 | కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ -1. ఈ సినిమా 2022లో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వాయిదా పడుతుందన్న వార్తలు కొన్నిరోజులుగా వైరలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో జరిగిన పలు సంఘటనల వలన వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా నడిచింది. అయితే తాజాగా ఈ వార్తలపై చిత్రబృందం స్పందించింది. వాయిదా వార్తలను ఫేక్ అని ప్రకటించిన చిత్రయూనిట్ అనుకున్న సమయానికే అక్టోబరు 2న ఈ సినిమాను విడుదల చేస్తామని వెల్లడించింది.
చిత్రయూనిట్ మొదట ప్రకటించిన తేదీ ప్రకారమే.. షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నామని, తమ ప్రణాళికలకు తగినట్లే షూటింగ్ జరుగుతోందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతుందని, తమను నమ్మితే వేచి ఉండటం ఎంత విలువైనదో అర్థమవుతుందని పేర్కొంది. సినిమాపై వస్తున్న ఊహాగానాలకు దూరంగా ఉండాలని, అనధికారిక ప్రకటనలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టింది.
ఇక తొలిపార్టును రూ.16 కోట్లలోపే ముగించిన రిషబ్.. ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఒక్క ప్రీ ప్రొడక్షన్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు.