Kannappa | హీరో మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తుండగా, ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. గత ఏడాది జూన్ 27న విడుదలైన ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, డిజిటల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. తొలుత సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించినా, అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది.
ప్రస్తుతం హిందీ వెర్షన్ మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులో ఉండగా, తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో సినిమా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తన సొంత యూట్యూబ్ ఛానెల్ అవా ఎంటర్టైన్మెంట్ ద్వారా ‘కన్నప్ప’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 3 నుంచి ఈ చిత్రం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను పక్కనబెట్టి నేరుగా యూట్యూబ్‌లో సినిమాను విడుదల చేయడం అరుదైన నిర్ణయమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమా చేరువ కావాలనే ఉద్దేశంతో మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో పాటు ప్రభాస్, మోహన్‌లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు కనిపిస్తారు. చిన్ననాటి సంఘటనలతో నాస్తికుడిగా మారిన తిన్నడు, తన గ్రామ ప్రజలకు అండగా నిలిచే ధైర్యవంతుడిగా ఎదుగుతాడు. కొన్ని పరిణామాల కారణంగా గ్రామం నుంచి బహిష్కరణకు గురైన అతడు, తన ప్రేయసి నెమలి పాత్రలో నటించిన ప్రీతి ముకుందన్తో కలిసి కొత్త ప్రయాణం మొదలుపెడతాడు.ఈ ప్రయాణంలో తిన్నడు పరమశివుడిపై ఎలా అపార భక్తిని పెంచుకున్నాడు? రుద్ర అనే పాత్రతో అతడి జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి? చివరకు అతడు ‘కన్నప్ప’గా ఎలా నిలిచాడు? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది. ఇప్పుడు యూట్యూబ్ స్ట్రీమింగ్‌తో ఈ భక్తి ప్రధాన చిత్రం మరింత మంది ప్రేక్షకులను చేరుకోనుంది.