Kannappa Movie | మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ‘కన్నప్ప’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన నుంచే నిరంతరం వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నారనే వార్తలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్‌లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో నటించడంతో ప్రేక్షకుల ఆసక్తి రెట్టింపయ్యింది. అయితే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ప్రీమియర్ల నుంచే కన్నప్పకు మంచి రివ్యూలు వచ్చాయి. తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాథుడి పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. మంచు మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా తన మార్క్ డైలాగ్ డెలివరీతో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ కూడా తన పాత్రను చక్కగా పోషించారు.
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. కీలకమైన 40 నిమిషాల ఎపిసోడ్లో ప్రభాస్ నటన సినిమాను నిలబెట్టిందని చెబుతున్నారు. ప్రభాస్ చెప్పిన పెళ్లి డైలాగ్‌కు థియేటర్లలో నవ్వులు వెల్లివిరిశాయి. ఇక క్లైమాక్స్‌లో శివుడికి తన కన్ను దానం చేసే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశంలో మంచు విష్ణు నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించిందని అంటున్నారు. పాటలు, నేపథ్య సంగీతం మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయని, వీఎఫ్ఎక్స్ కూడా పర్వాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా ‘కన్నప్ప’ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేయడం ఖాయమని తెలుస్తోంది.