Kannappa | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. కన్నప్ప చిత్రంని బుధవారం రాత్రి ముంబైలో కొంత మంది ప్రముఖులకి ప్రదర్శించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా చూసిన ఎనలిస్ట్‌లు మూవీకి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
కన్నప్ప క్లైమాక్స్ .. రిషబ్ శెట్టి కాంతార క్లైమాక్స్ మాదిరిగా చాలా ఇంటెన్సిటీతో ఉందని అంటున్నారు. పరమ శివుని భక్తులు అయితే సినిమా చూశాక ఎంతో భక్తి భావంతో బయటకు వస్తారని అంటున్నారు. పరమేశ్వరునికి అపర భక్తుడు అయినటువంటి తిన్నడు (‘కన్నప్ప’) కథతో చిత్రం తెరకెక్కగా, ఇందులో నాస్తికుడి నుంచి శివ భక్తుడిగా తిన్నడు ఎలా మారాడు? ‘కన్నప్ప’ ఎలా అయ్యాడు? అనేది చూపించనున్నారట. ప్రతి ఫ్రేమ్ కూడా ప్రేక్షకులని కట్టిపడేస్తుందని అంటున్నారు. అయితే కన్నప్ప ఫస్ట్ పార్ట్ కాస్త స్లో ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
చిత్రం ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా నెమ్మదిగా ఉంటుందని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరిందని అంటున్నారు. మోహన్ లాల్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. ఇక అతిథిగా 40 నిమిషాల పాటు కనిపించే ప్రభాస్, రుద్ర పాత్రలో తనదైన నటనతో సినిమాని మరో మెట్టు ఎక్కించారని చెబుతున్నారు. ఇక ‘కన్నప్ప’ పాత్రలో నటించడం కోసమే పుట్టినట్టుగా విష్ణు మంచు అద్భుతమైన యాక్టింగ్ చేశాడని బాలీవుడ్ జనాలు చెబుతున్నారు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా విష్ణు అదరగొట్టాడట. కన్నప్ప పతాక సన్నివేశాల్లో చివరి 15 నిమిషాలు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడట మంచు విష్ణు. పరమేశ్వరుని పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ జంట కూడా అదరగొట్టారట. ఫస్టాఫ్ కాస్త స్లోగా వెళ్లడం, నిర్మాణ విలువలు కాస్త తక్కువగా ఉండడమే మైనస్ అంటున్నారు. క్లైమాక్సే సినిమాని నిలబెడుతుందని కూడా చెబుతున్నారు.