Kannappa | మంచు విష్ణు కన్నప్ప మరి కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి మరోసారి మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ‘కన్నప్ప’ కోసం ముందస్తు బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. 24 గంటల్లోనే 1,15,000 టికెట్లు అమ్ముడయ్యాయి, అని ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు.ఈ రేంజ్లో టికెట్ బుకింగ్స్ జరుగుతుండటంతో ఈ మూవీ తొలిరోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ రకమైన ప్రీ-రిలీజ్ ప్రేమ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని విష్ణు అన్నారు. కన్నప్పకు ఇలాంటి మద్దతు ఇచ్చిన ప్రతి సినీ ప్రేమికుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ మంచు విష్ణు తన ట్వీట్లో పేర్కొన్నారు.ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ‘కన్నప్ప’ సినిమా ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు జరుపుకుంటుంది, అలాగే ఇండియాలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవుతాయి.
ఈ సినిమాను శివ భక్తుడు ‘కన్నప్ప’ జీవిత కథ ఆధారంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టుపై మంచు విష్ణు అండ్ టీమ్‌కు చాలా నమ్మకముంది. హిందీ ఫైనల్ కాపీని ఇప్పటికే పలువురు ప్రముఖ సినీ వ్యక్తులు చూసి చిత్రం చాలా బాగుందని తెలియజేశారు. మంచు విష్ణు ఈ చిత్రాన్నితన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్న నేపథ్యంలో మూవీని భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యంతో రూపొందించారు. VFX, భారీ లొకేషన్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.