Balakrishna-Shiva rajkumar Movie | ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలకు కొదవే లేదు. ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోలు ఏడాదిలో ఒక్కసారైనా మల్టీస్టారర్ సినిమాల్లో కనిపించేవారు. ఇక ఆ తర్వాతి తరం మల్టీస్టారర్ సినిమాలే కరువయ్యాయి. మీడియం రేంజ్ హీరోలు తప్పితే.. స్టార్ హీరోలు కనీసం కథలను కూడా వినేవారు కాదు. ఇక దర్శక నిర్మాతలు సైతం స్టార్లతో మల్టీస్టారర్ సినిమాలంటే ఒకడుగు వెనక్కే వేసేవారు. ఏ హీరోను తక్కువ చూపినా ఫ్యాన్స్ ఊరుకోరని, రచ్చ రచ్చ చేస్తారని భయపడేవారు. దాంతో మల్టీస్టారర్ సినిమాలే కరువయ్యాయి. మళ్లీ ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాలకు మంచి గిరాకీ పెరుగుతుంది.
ముఖ్యంగా ఆర్ఆర్ఆర్తో ఇద్దరు స్టార్లను రాజమౌళి చూపించిన విధానం ముచ్చటేసింది. కొంత మంది తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను తక్కువ చూపించాడని అన్నా.. ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లే సరికి తారక్ పాత్రను హాలీవుడ్ మేకర్స్ మెచ్చుకోవడంతో సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు వచ్చిన భీమ్లా నాయక్ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఇటీవలే ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల్లో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్.. బాలయ్యతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.
కాగా తాజాగా ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మల్టీస్టారర్ మూడు భాగాలుగా తెరకెక్కనుందట. ఇక దీనిని ఏ హర్ష అనే కన్నడ దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. గతేడాది వచ్చిన వేద సినిమాను తీసింది ఈ దర్శకుడే. పదిహేనేళ్లకు పైగా దర్శకత్వ అనుభవం ఉన్న ఏ హర్ష చేతికి ఈ క్రేజీ కాంబినేషన్ వెళ్లిందట. ఇక మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో తొలి భాగంలో చివరి పది నిమిషాలు బాలయ్య కనిపించన్నుడట. ఇక రెండో పార్టులో బాలయ్యతో ఫుల్‌లెంగ్త్ రోల్లో కనిపించనున్నాడట. అంతేకాకుండా సూపర్‌స్టార్ రజనీ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనున్నాడట. థర్డ్ పార్ట్‌లో మరో సీనియర్ హీరో వస్తాడట. ఇలా మూడు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కనుందట.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్రయూనిట్ బిజీగా ఉందట. ఇది గనక క్లిక్ అయితే మాత్రం ఏ హర్ష రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. మరో ప్రశాంత్ నీల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.