Kangana Ranaut | బాలీవుడ్లో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నటి తాప్సీ పన్ను ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌తో తనకున్న వివాదంపై స్పందించగా, దీనిపై కంగనా తీవ్రంగా మండిపడ్డారు. తాప్సీ చేసిన వ్యాఖ్యలు తన పెంపకాన్ని, తల్లిదండ్రులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ కంగనా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు. తన తల్లిదండ్రులు ఒరిజినల్ వ్యక్తికి జన్మనిస్తే, ఆమె తల్లిదండ్రులు మాత్రం ఒక ‘సస్తీ కాపీ’ (చౌకైన నకలు) ని ఎందుకు కనాల్సి వచ్చిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ, కంగనా రనౌత్‌ను తాను ఎప్పుడూ కలలో కూడా కలవలేదని, తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తమ పెంపకం, ఆలోచనా విధానాన్ని బట్టే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాప్సీ తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా కేవలం తన పేరును మాత్రమే హైలైట్ చేసుకుంటున్నారని విమర్శించారు. కాగా, 2019లో ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా సమయంలో కంగనా సోదరి రంగోలీ చందేల్.. తాప్సీని ‘సస్తీ కాపీ’ అంటూ విమర్శించడంతో వీరిద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత 2020లో బంధుప్రీతి (నెపోటిజం) చర్చల సమయంలో కంగనా తాప్సీని ‘బి-గ్రేడ్ నటి’ అంటూ విమర్శించడం గమనార్హం.
ఇక తాప్సీ రాజకీయాల్లో ప్రవేశించే ఆలోచనపై స్పందిస్తూ, తాను రాజకీయాలకు తగినట్లుగా ఉండనని, తనది చాలా నిజాయితీ గల మనస్తత్వమని, ప్రస్తుతానికి సినిమాలపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే, తాప్సీ నటించిన రివెంజ్ డ్రామా చిత్రం ‘గాంధారి’ సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. మరోవైపు కంగనా రనౌత్ త్వరలో ఆర్. మాధవన్‌తో కలిసి ఓ పాన్-ఇండియా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటించనున్నారు.