Kangana Ranaut | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన కంగనా.. ఒకవైపు సినిమాలు చేస్తునే మరోవైపు తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అయితే రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన కంగనా తన రాజకీయ జీవితంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
కంగనా మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లో ఇంకా పూర్తిగా స్థిరపడలేదని, ఎంపీగా గెలిచిన కూడా ప్రస్తుతానికి దాన్ని ఆస్వాదించడం లేదని తెలిపారు. ప్రజలు తన వద్దకు “పాడైపోయిన రోడ్లు, నాలాల” వంటి స్థానిక సమస్యలతో వస్తున్నారని ఆమె వెల్లడించారు. పాలిటిక్స్ చాలా భిన్నమైన పని, సామాజిక సేవ లాంటిది. ఇది నా నేపథ్యం కాదు. నేను ప్రజలకు సేవ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు అని కంగనా తన మనసులోని మాటను బయటపెట్టింది.
స్థానిక సమస్యలతో ప్రజలు తన వద్దకు వచ్చిన తీరును కంగనా వివరిస్తూ.. నేను ఎంపీని కదా ప్రజలు అందుకే నా వద్దకు పంచాయతీ స్థాయి సమస్యలతో వస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు నన్ను చూసినప్పుడు, ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన రోడ్లు పాడైపోవడం వంటి సమస్యలను నాకు చెప్పుకుంటున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ సమస్య అని నేను వారికి చెప్తే.. ‘మీకు డబ్బు ఉంది కదా, మీ డబ్బు ఉపయోగించండని అంటారు అని కంగనా తన అనుభవాలను పంచుకుంది.
అలాగే తనకు ప్రధాని కావాలనే ఆశయం తనకు లేదని, సామాజిక సేవ తన నేపథ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ స్వార్థపూరిత జీవితాన్ని గడిపానని, పెద్ద ఇల్లు, పెద్ద కారు, వజ్రాలు కావాలని కోరుకునే వ్యక్తిని అని కంగనా పేర్కొన్నారు. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక ఎంపీగా ఆమె ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ఇవి ప్రతిబింబిస్తున్నాయని కొందరు భావిస్తుండగా.. మరికొందరు ఆమె వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు.