Kanappa Film Hard Drive | మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి ఓ కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కన్నప్ప చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన దృశ్యాలు, డేటా ఉన్న హార్డ్ డ్రైవ్ మాయం అయినట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. అయితే మిస్ అయిన హార్డ్ డ్రైవ్‌కి సంబంధించి నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులపైన నమ్మక ద్రోహం కేసు నమోదు చేసింది. సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా పంపిన ఈ హార్డ్ డ్రైవ్‌ను ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత రఘు కనిపించకుండా పోయాడు.
రఘు హార్డ్ డ్రైవ్‌ను చరిత అనే మహిళకు అప్పగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత చరిత కూడా కనిపించకుండా పోవడంతో, ఈ ఘటన వెనుక సినిమాకు నష్టం కలిగించే కుట్ర కోణంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రఘు, చరితల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.