Kamal Haasan’s comment on Sanatana Dharma | సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్. సనాతన ధర్మం సంకెళ్లను తెంచుకోవడానికి ఉన్న ఏకైక ఆయుధం చదువు మాత్రమేనని తెలిపాడు. నటుడు సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ ఇటీవలే 15 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ ఫౌండేషన్ వలన ఇప్పటివరకు 5000 మందికి పైగా విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకోగా.. 2000 మందికి పైగా విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్నారు. అయితే ఈ సంస్థ 15వ వార్షికోత్సవాన్ని చెన్నైలో జరుపగా.. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా కమల్ హాసన్ వచ్చి మాట్లాడాడు.
విద్యార్థులను ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడుతూ.. మీరు ఏ ఆయుధాన్ని చేతిలోకి తీసుకోవద్దు. విద్యను మాత్రమే ఆయుధంగా చేసుకోండి. అది లేకుండా మనం ఎప్పటికీ గెలవలేం. మూర్ఖులను ఓడించడానికి ప్రయత్నించినప్పుడు జ్ఞానం మాత్రమే గెలుస్తుందని కమల్ చెప్పుకోచ్చాడు. అలాగే సనాతన ధర్మం సంకెళ్లను తెంచుకోవడానికి ఉన్న ఏకైక ఆయుధం చదువు మాత్రమేనని తెలిపాడు. ఈ సందర్భంగా నీట్ పరీక్షపై కూడా కమల్ తీవ్ర విమర్శలు చేశాడు. నీట్ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని, అందుకే తాము దానిని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కమల్ హాసన్ వ్యాఖ్యలు కూడా అదే తరహాలో రాజకీయంగా చర్చకు దారితీశాయి.