భారతీయ సినీచరిత్రలోని టాప్ 20 క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన చిత్రం కమల్, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’. ఆ సినిమా వచ్చిన 38ఏళ్ల తర్వాత మళ్లీ కమల్‌హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న సినిమా ‘థగ్‌లైఫ్’. అందుకే ఈ పాన్ ఇండియా సినిమాకోసం సగటు ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన తొలిపాటకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. ఈ నెల 17న ఈ సినిమా ట్రైలర్‌ని ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు గురువారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
అలాగే ఈ నెల 24న హైదరాబాద్‌లో ఆడియో లాంచ్, ఈ నెల 29న విశాఖపట్టణంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ఈ ప్రకటనలో మేకర్స్ పేర్కొన్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం ద్వారా ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శింబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాతలు: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయ్‌నిధి స్టాలెన్, నిర్మాణం: రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్.