కమల్‌హాసన్-మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన ‘థగ్‌లైఫ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్నది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘నాయకుడు’ (1987) వంటి కల్ట్‌క్లాసిక్ హిట్ తర్వాత 38 ఏళ్ల విరామం అనంతరం కమల్‌హాసన్-మణిరత్నం కలయికలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలేర్పడ్డాయి. శింబు, త్రిష, జోజు జార్జ్, నాజర్, అశోక్ సెల్వన్, అభిరామి, ఐశ్వర్యలక్ష్మి వంటి తారలు ఇందులో భాగమయ్యారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందని, అంతటా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చిత్రబృందం పేర్కొంది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో భారీ యాక్షన్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలుంటాయని, రెహమాన్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందని మేకర్స్ తెలిపారు.
‘నాయకన్’ తరహాలోనే మణిరత్నం, కమల్‌హాసన్ కెరీర్లో ‘థగ్‌లైఫ్’ మరో కల్ట్క్లాసిక్గా మిగిలిపోతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి ‘థగ్‌లైఫ్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.