దక్షిణాది లెజెండ్స్ రజనీకాంత్, కమల్‌హాసన్ మళ్లీ కలిసి నటిస్తే చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష. వీరిద్దరు కెరీర్ ఆరంభంలో 20కిపైగా చిత్రాల్లో నటించారు. వాటిలో మెజారిటీ సినిమాలు సూపర్‌హిట్స్. అయితే ఇద్దరు హీరోలు వ్యక్తిగతంగా స్టార్డమ్ సంపాదించుకున్న తర్వాత కలిసి నటించలేదు. ‘దళపతి’ సినిమాలో కమల్‌హాసన్‌ను తీసుకోవాలనుకున్నారు దర్శకుడు మణిరత్నం. కానీ కుదరలేదు. ఆ స్థానంలో మమ్ముట్టి నటించారు.
ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారట. వయసు మళ్లిన ఇద్దరు గ్యాంగ్స్టర్స్ రిటైర్ అయిన తర్వాత ఏం చేశారు? వారి లైఫ్ ఏమిటన్నదే ఈ సినిమా కాన్సెప్ట్ అని తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి అన్నీ అనుకూలించాలంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇది పూర్తయిన తర్వాత ‘ఖైదీ’ ‘విక్రమ్’ సినిమాలకు సీక్వెల్స్ చేయాల్సి ఉంది.
ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తవడానికి నాలుగేళ్లకు పైగా పట్టొచ్చు. ఆలోగా పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పలేం. అయితే తన ఆరాధ్య నటులు రజనీ-కమల్‌హాసన్ కాంబోలో సినిమా చేయాలన్నది లోకేష్ కనకరాజ్ లైఫ్‌టైమ్ డ్రీమ్ అట. దానిని ఎప్పటికైనా నెరవేర్చుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు లోకేష్ కనకరాజ్. అభిమానులు కూడా ఈ ఇద్దరు లెజెండ్స్‌ను వెండితెరపై చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.