Kamal Haasan | లోకల్ సినిమానే గ్లోబల్ సినిమాగా అవతరిస్తుందని, భారతీయ మూల కథల్ని తెలుసుకోవాలని ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తున్నదని చెప్పారు అగ్ర నటుడు కమల్‌హాసన్. ఇటీవల ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆయన సమకాలీన భారతీయ సినిమా తీరుతెన్నులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారతదేశం అందించే పురస్కారాల్ని అందుకోవడానికి హాలీవుడ్ తారలు తరలి రావాలని, అప్పుడే భారతీయ సినిమా కీర్తి విశ్వవేదికపై విరాజిల్లుతుందని ఆయన ఆకాంక్షించారు.
‘మన సంస్కృతిలోతుల్ని ఎంత వరకు తరచిచూస్తే..అదే స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటాం. ఇప్పుడు ప్రపంచం మన కథల్ని, సంస్కృతి మూలాల్ని తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. ఇంతకుముందు ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రపంచ సినిమాతో సమానంగా భారతీయ సినిమా ఎదుగుతున్నది’ అన్నారు. ఇంగ్లీష్ భాషను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రాంతీయ భాషలు ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, భాషా వైభవాన్ని కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలని కమల్‌హాసన్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు సినిమాలకంటే రాజకీయాలు అంటేనే ఆసక్తిగా ఉందని ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.