Kalyan Ram | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా నివాళి కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడు, నటుడు కళ్యాణ్ రామ్ తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజాజీవితంలో చేసిన సేవలు, రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పులను అభిమానులు స్మరించుకున్నారు.
ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ అంతటా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయగా, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ నాయకులు సమన్వయం చేశారు. ఎప్పటిలాగే ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల సందడి కనిపించగా, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై తమ అభిమాన నేతకు నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్టీఆర్ 30వ వర్ధంతిని అధికార కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ఆశయాలను ప్రజలకు గుర్తుచేసేలా పలు కార్యక్రమాలు చేపట్టారు.
ఒంగోలులో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్నూలులో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించనున్నారు. రాజకీయ నాయకుడిగానే కాదు, నటుడిగా, ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసాడు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా రాజకీయాలు, కళలు, సేవా కార్యక్రమాలు అన్నీ ఒకే వేదికపై కలసి సాగుతూ, ఎన్టీఆర్ వారసత్వాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.