Kalki 2898 AD | ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ దశ నుంచే పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికాపడుకోన్ వంటి అగ్ర తారలు ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది.
మహాభారతకాలంలో మొదలయ్యే ఈ కథ దాదాపు ఆరువేల సంవత్సరాల వ్యవధిలో నడుస్తుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్న రీతిలో నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మైథాలజీ, సైన్స్ అంశాల కలబోతగా పాన్ వరల్డ్ కథాంశం కావడంతో ప్రేక్షకులందరికీ సినిమా రీచ్ అయ్యేలా భారీ స్థాయిలో ప్రచారం చేయబోతున్నారని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.