వెండితెర అందాల చందమామ కాజల్ అగర్వాల్ శనివారం జన్మదినోత్సవాన్ని జరుపుకొంది. 36వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ పంచదార బొమ్మకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలందజేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తోంది కాజల్ అగర్వాల్. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ను త్వరలో పునఃప్రారంభించనున్నారు. ఇందులో చిరంజీవి ఆచార్యుడిగా, నక్సలైట్‌గా రెండు భిన్నపార్శాలున్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. దేవుడి మాన్యాల అన్యాక్రాంతం గురించి చర్చిస్తూ సామాజిక సందేశాత్మకంగా దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్‌ను తిరిగి ఆరంభించబోతున్నారని తెలిసింది. మరోవైపు కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఐదు చిత్రాలున్నాయి. తెలుగులో ‘ఆచార్య’తో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది కాజల్ అగర్వాల్.