అభిమానం హద్దులు దాటితే పిచ్చిగా పరిణమిల్లుతుంది. ఇలాంటి వారివల్ల సెలబ్రిటీలకు ఇబ్బందులు తలెత్తడం రివాజే. హీరోల కాళ్లమీద పడిపోవడం, హీరోయిన్లను తాకడానికి ప్రయత్నించడం.. ఇలాంటి దుశ్చర్యల వల్ల ఇబ్బందుల పాలైన నటీనటులు ఎందరో. బాలయ్య లాంటి సీనియర్ హీరోలు సహనం కోల్పోయి చేయి చేసుకునేది కూడా అందుకే. ఇటీవలే నటి కాజల్ అగర్వాల్‌కి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఓ అభిమాని వల్ల ఎదురైందట.
ఆ విషయాన్ని తన ‘సత్యభామ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కాజలే వెల్లడించింది. ‘కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నా. తొలి రోజు చిత్రీకరణ పూర్తయింది. నేను నా కేరవాన్‌లోకి వెళ్లిపోయాను. ఇంతలో ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్.. అనుమతి లేకుండా నా కేరవాన్‌లోకి వచ్చి తన చొక్కా విప్పేశాడు. నేను షాక్.
విషయం ఏంటంటే.. తన గుండెలపై నా పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు తను. దాన్ని చూపించే ప్రయత్నం అదంతా. ఈ హఠాత్ పరిణామానికి భయపడిపోయాను. నాపై అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో ప్రదర్శించడం ఆనందమే. కానీ.. నా ప్రైవేటు ప్లేస్‌లోకి వచ్చి అలా ప్రయత్నించడం మాత్రం కరెక్ట్ కాదు కదా.. అదే సున్నితంగా చెప్పి హెచ్చరించాను. ఏదేమైనా అభిమానానికి కూడా హద్దులుండాలి.’ అంటూ చెప్పుకొచ్చింది అందాల చందమామ కాజల్ అగర్వాల్.