రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి సినిమాతో ఫుల్ క్రేజ్ పొందిన జ్యోతిక ఇప్పటికీ సినిమాలు చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తుంది. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్లాడి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా ఇంకా అదే ఎనర్జీతో వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే జ్యోతిక ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున అడ్వెంచర్ ట్రిప్‌కు వెళ్లిన జ్యోతిక.. త్రివర్ణ పతాకంతో తనలో ఉన్న దేశభక్తిని చాటింది. కశ్మీర్‌లోని సుందర సరస్సుల మధ్య తన టీమ్‌తో దిగిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బికాత్ అడ్వెంచర్స్ టీమ్‌లోని సభ్యులతో జ్యోతిక హిమాలయ అందాలను తిలకించారు. హలో ఎవిరివన్ అంటూ తన పోస్టులో పేర్కొన్న జ్యోతిక.. తన లాక్డౌన్ డెయిరీల్లోంచి కొన్ని పాజిటివ్ అంశాలను పోస్టు చేస్తున్నట్లు చెప్పింది
జ్యోతిక ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో ఆమె ఫాలోవర్స్ నిమిషాల్లో భారీగా పెరిగారు. జ్యోతిక ఖాతా తెరిచిన 45 నిమిషాల్లోనే 1.2 మిలియన్ల ఫాలోవర్స్ చేరారు. నిమిషాల్లోనే ఇంత మంది ఫాలోవర్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. పెద్ద స్టార్ డమ్ ఉన్న హీరోలకే ఇలాంటి రేర్ ఫీట్ సాధ్యం. అలాంటి అరుదైన రికార్డుని జ్యోతిక సాధించడం విశేషం. ఈ మధ్య కాలంలోనే మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మరింత సెలక్టివ్ గా ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తున్నారు.