Jyothika | ‘నా 28వ ఏటే ఇద్దరు పిల్లలకు తల్లిని అయ్యాను. ఆ తర్వాత కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశా. కానీ స్టార్ హీరోల సరసన మాత్రం అవకాశాలు రాలేదు. దానికి కారణం.. నేను వివాహితనవ్వడమే.’ అంటూ వాపోయారు నటి జ్యోతిక. ఇటీవలే ఆమె నటించిన ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదలైంది. ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్రపరిశ్రమపై కొన్ని వ్యాఖ్యలు చేశారు జ్యోతిక.
‘గతంలో నాలాంటి మహిళల కోసమే కథలు రాసే సంస్కృతి ఉండేది. గ్రేట్ డైరెక్టర్ కె.బాలచందర్ మహిళా నేపథ్యంలోనే ఎన్నో కథలు రాశారు. సినిమాలు తీశారు. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించేవాళ్లు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. అగ్ర హీరోలదే హవా. స్త్రీ ప్రాధాన్యతా చిత్రాలు తగ్గిపోవడానికి బడ్జెట్ కూడా ఓ కారణమైతే.. మనసు లేకపోవడం మరో కారణం.
ముఖ్యంగా స్త్రీల కోసం కథలు రాసే రచయితలు ఇప్పుడు లేరు. అందుకే దక్షిణాదిలో నటిగా కొనసాగడం కష్టం. సిద్ధాంతాలకు కట్టుబడి సినిమాల్లో నటించే స్త్రీలు అక్కడ ఒంటరిపోరు చేయాల్సొస్తుంది. కానీ ఉత్తరాదిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయ్. ఈ విషయంలో బాలీవుడ్ దర్శక, నిర్మాతలను, రచయితలను అభినందించకుండా ఉండలేకపోతున్నా.’ అన్నారు జ్యోతిక.