Jyothi Krishna | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరి హర వీరమల్లు’జులై 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. వీఎఫ్ఎక్స్ విషయంలోనే పలు విమర్శలు అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సినిమా ఎంత కలెక్ట్ చేసింది, మూవీ హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ముఖ్యంగా సనాతన ధర్మం అంశాన్ని ఎలా మిళితం చేశారు? అసలు కథలో ఇది మొదట నుంచే ఉందా? లేదా తర్వాత యాడ్ చేశారా? అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈ సినిమాను మొదట దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేయగా, ఐదున్నరేళ్ల క్రితం ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
కానీ మధ్యలో కొన్ని కారణాలతో క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. దీంతో కథలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక సినిమా రెండు పార్టులుగా మలచబడింది.సినిమాలోని ప్రధాన అంశాల్లో ఒకటైన సనాతన ధర్మం కాన్సెప్ట్ గురించి దర్శకుడు జ్యోతికృష్ణ తాజాగా స్పందించారు. కోహినూర్ వజ్రంతో కథ మొదలవుతుంది. కానీ సెకెండాఫ్ మొత్తం సనాతన ధర్మం చుట్టూ తిరుగుతుంది. ఇది నా ఆలోచనే. క్రిష్ రాసిన కథలో ఈ పాయింట్ లేదు. నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన తర్వాతే రెండు పార్టులుగా చేయాలని నిర్ణయించాం అని తెలిపారు.అలాగే, పవన్ కళ్యాణ్ ఇటీవల సనాతన ధర్మంపై మాట్లాడుతున్న సందర్భంలో, ఈ అంశాన్ని కథలో చేర్చడం సహజంగా జరిగిందని చెప్పారు.
క్రిష్ విజన్ ప్రకారం కోహినూర్ చుట్టూ తిరిగే కథతో మాయాబజార్ లాంటి సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ కథ తీయాలంటే నాలుగున్నర గంటల ఫుటేజ్, భారీ డేట్స్ కావాలి. అప్పటికే పవన్ గారు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలం వెయిట్ చేశారు. పాండమిక్, లాక్డౌన్, ఎలక్షన్ల కారణంగా ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవుతుందని క్రిష్ చెప్పారు. తాను వెళ్లి మరో ప్రాజెక్ట్ పూర్తి చేసి వస్తానన్నారు అని జ్యోతికృష్ణ వివరించారు. పార్ట్-1 కోసం కథలో మార్పులు చేయాల్సి వచ్చిందని, కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే అసలు కథను పార్ట్-2లో చూపిస్తామన్నారు.క్రిష్ రాసిన కథ పార్ట్-2లో కొనసాగుతుంది. దాంతో పాటు సనాతన ధర్మం అంశం కూడా ఉంటుంది. రెండింటినీ మిళితం చేసి, పార్ట్-2లో మెరుగైన కథను అందించేందుకు ప్లాన్ చేస్తున్నాం,” అని తెలిపారు.