JVAS | చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఒకటి. ఇందులో అలనాటి స్టార్ హీరోయిన్, స్వర్గీయ శ్రీదేవి కథానాయికగా నటించింది. 1990 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఈ మూవీ మే 9న విడుదల కాగా, రీసెంట్గా 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిత్రాన్ని మే 9న రీ రిలీజ్ చేశారు. మూవీకి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టారు.
అయితే రీ రిలీజ్ కి అసలు బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చయ్యిందని ఇటీవల అశ్వినీదత్ చెప్పారు. 1990లో సినిమా బడ్జెట్ 2 కోట్లు కాగా, రీ-రిలీజ్ కి 9 కోట్లు వరకు ఖర్చు చేశారట. ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో దీనావస్థలో ఉన్న ప్రింట్లను ముందుగా మరమత్తు చేసి దానిని 8K వెర్షన్‌లోకి మార్చారు. ఆ తర్వాత దానికి కలర్ గ్రేడింగ్, ఇతర టెక్నాలజీ హంగులు అద్ది 4K వెర్షన్లో 3డీ, 2డీ వెర్షన్లకు మార్చారట.ఇక ఈ ప్రక్రియకి దాదాపు 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే 3డీ వెర్షన్ క్వాలిటీ అంత గొప్పగా ఏమి లేదు కాని 2 డీ వర్షెన్ మంచి అనుభూతిని పంచిందని ప్రేక్షకులు అన్నారు.
అప్పట్లో ఈ సినిమాను 2 కోట్ల రూపాయలతో రూపొందించగా.. 15 కోట్ల రూపాయల వసూళ్లను బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. రీరిలీజ్ సమయంలో తొలి రోజున ఈ చిత్రం 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రా, నైజాంలో ఈ మూవీ 1 కోట్ల రూపాయల గ్రాస్, కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్లో 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. కాని తర్వాత తర్వాత కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఐదో రోజు కేవలం 20 లక్షలు మాత్రమే వసూలు కాగా, ఐదు రోజుల్లో సినిమా కేవలం 2.84 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 2.3 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 54 లక్షలు వసూలయ్యాయని సమాచారం. ఇక రెండో వారం నుంచి పెద్దగా కలెక్షన్లు ఉండవని అర్ధమవుతుంది. దీంతో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీరిలీజ్‌లో భారీ నష్టాలనే మిగిల్చినట్టు అయింది.