Junior Movie Teaser | టాలీవుడ్ యువ నటులు కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జూనియర్’. జులై 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జీవితాన్ని సరదాగా, ఆనందంగా గడిపే యువకుడిగా హీరో కిరీటి పాత్రను టీజర్ పరిచయం చేసింది. సంభాషణలు ఆకట్టుకునేలా ఉండగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది బాలీవుడ్ బ్యూటీ జెనీలియా. ఇందులో కీలక పాత్రలో జెనీలియా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాపై దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘జూనియర్’ ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని, జీవిత లక్ష్యం పట్ల స్పష్టత ఉన్న ఓ యువకుడి కథగా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించగా, కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సంభాషణలు రాశారు. రచన-దర్శకత్వం బాధ్యతలను రాధాకృష్ణ నిర్వర్తించారు.