Jismat Mandi | సినీ నటుడు, వ్యాపారవేత్త ధర్మ మహేష్ తన ప్రసిద్ధ ‘జిస్మత్ మండీ’ నూతన బ్రాంచ్‌ను బెంగళూరులోని మార్తహళ్లిలో ఘనంగా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందిన ఈ బ్రాండ్, ఇప్పుడు కర్ణాటక రాజధానిలో తన సేవలను విస్తరించింది. నాణ్యమైన, రుచికరమైన ప్రీమియం ఫుడ్‌ను భోజన ప్రియులకు అందించడమే లక్ష్యంగా ఈ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ధర్మ మహేష్ మాట్లాడుతూ, ‘జిస్మత్’ అనే పేరు తన కుమారుడి పేరులోని భావాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ బ్రాండ్ ప్రయాణం తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. బెంగళూరు నగరంతో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, తాను చూసిన మొదటి మెట్రో నగరం ఇదేనని, వ్యక్తిగతంగా తన ఎదుగుదలలో ఈ నగరం కీలక పాత్ర పోషించిందని భావోద్వేగానికి లోనయ్యారు. హనుమాన్ జంక్షన్, గన్నవరం వంటి చిన్న పట్టణాల నుండి వచ్చిన తనకు, 2008లో బెంగళూరుకు రావడం తన జీవితంలో పెద్ద మలుపు అని ఆయన వివరించారు. కోరమంగళాలో తన మొదటి అడుగు పడిందని, ఆ రోజుల్లో ఓయాసిస్ మాల్ చూసిన అనుభవం తన ఆలోచనా విధానాన్నే మార్చివేసిందని గుర్తు చేసుకున్నారు.
ఒకప్పుడు సాధారణ వ్యక్తిగా ఈ నగరానికి వచ్చిన తాను, ఇప్పుడు ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఇక్కడ జిస్మత్ మండీని ప్రారంభించడం దైవ నిర్ణయంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ సంస్థ కేవలం లాభాల కోసం కాకుండా, వినియోగదారుల ఆరోగ్యం, భద్రత మరియు సంతృప్తికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన ముడి పదార్థాలు, పరిశుభ్రమైన వాతావరణంలో తయారయ్యే రుచికరమైన ఆహారం జిస్మత్ మండీ ప్రత్యేకత అని, కస్టమర్లు సంతోషంగా ఉంటేనే అసలైన విజయం లభిస్తుందని ధర్మ మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఎదుగుదలకు సహకరించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు కస్టమర్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.