‘పని ప్రదేశాల్లో వేధింపులు ఉన్నాయం టూ బాధితురాలు ఛాంబర్‌ని ఆశ్రయించింది. మీడియాలో విషయం వెలుగుచూడగానే, లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. మా పరిధిలో మేం విచారణ పూర్తి చేశాం. ఇద్దరి వాదనలు విన్నాం. 90రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం. ఇలాంటి వ్యవహారాలపై పరిశ్రమకు చెందిన ఎవరు కైంప్లెంట్ చేసినా.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని టాలీవుడ్‌కి చెందిన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ అధ్యక్షురాలు ఝాన్సీ తెలిపారు.
ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం విదితమే. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై టాలీవుడ్‌కు చెందిన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఝాన్సీ మాట్లాడుతూ ‘బాధితురాలు పని ప్రదేశాల్లో లైంగిక వేధిపులకు ఎదుర్కొన్నానని పేర్కొన్నది.
ఈ ఒక్క విషయాన్నే కాకుండా, ఈ వ్యవహారంలో మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు వైద్యపరంగా, న్యాయపరంగా ఆ అమ్మాయి సహకరించాలి. ఆ అమ్మాయికి అండగా నిలవడానికి మా కమిటీ సిద్ధంగా ఉంది. అంతేకాదు, ‘భూమిక హెల్ప్‌లైన్’ అనే ఎన్జీవో సంస్థ కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది’ అని ఝాన్సీ చెప్పారు.
సినీపరిశ్రమలో మహిళల క్షేమానికి ఢోకాలేదని తెలియజేసేందుకే ఈ ప్రెస్‌మీట్ పెట్టామని, 90రోజుల్లో దీనికి పరిష్కారం ఆలోచించి, మీడియాకు వివరిస్తామని ప్యానెల్ సభ్యుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ వద్ద ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ కంప్లయింట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఈ బాక్స్ ద్వారా తమ సమస్యను తెలియజేయవచ్చునని విజ్ఞప్తి చేస్తూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది.