అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపికా పడుకోన్ కథానాయిక. ‘పుష్ప-2’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ‘ఏఏ 22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ముంబయిలో కీలక షెడ్యూల్ ముగిసింది. త్వరలో అబుదాబిలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నారని సమాచారం.
పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ చిత్రమిదని, ఇందులో అల్లు అర్జున్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యతనిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో జపనీస్-బ్రిటీష్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషి భాగం కానున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో తీసుకున్న ఫొటోలను ఆయన తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘భారతీయ సినిమాకు పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నా కల తీరింది. నెలరోజులు ఈ టీమ్‌తో పనిచేశా. ఎవరూ ఊహించని కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది’ అంటూ హోకుటో కొనిషి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాలో డ్యాన్స్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుందని, ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ నిర్ధేశకత్వంలో అల్లు అర్జున్ డ్యాన్స్‌ల్లో అదరగొట్టబోతున్నాడని అభిమానులు ఖుషీ అవుతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.