Janhvi Kapoor | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడలో నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలో హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగులో మాట్లాడి అభిమానులను ఆశ్చర్యపరిచిన ఆమె, తన మాటలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగు ప్రేక్షకులు తనపై, సినిమా బృందంపై చూపిస్తున్న ప్రేమ చూసి ఎంతో ఆనందంగా ఉందని జాన్వీ చెప్పింది.
మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’ సినిమా చూసిన తర్వాత కూడా ఇదే ప్రేమతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. ప్రతి మనిషి జీవితానికి అర్థం ఏమిటి, తన అసలు గుర్తింపు ఏమిటి అనే అంశాలను ఈ కథలో చూడొచ్చు అని జాన్వీ పేర్కొంది. తన వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడిన జాన్వీ, నా జీవితానికి అర్థం సినిమాలు చేయడం, మిమ్మల్ని అలరించడం. నా గుర్తింపు కూడా ఈ నేలతో, మీ అందరితో ముడిపడి ఉంది. మేమంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ఈ చిత్రం మీకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను” అని తెలిపింది.
అలాగే ‘పెద్ది’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన జాన్వీ, ఈ ప్రాజెక్ట్ ద్వారా రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేసింది. “చరణ్ గారితో పనిచేయడం గొప్ప అనుభవం. బుచ్చిబాబు సానా నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ దర్శకుల్లో ఒకరు. మా చిత్రబృందం మొత్తం ఈ సినిమా కోసం తమ శక్తిమేరకు కష్టపడింది. మీరు ఇంతమంది వచ్చి మాకు మద్దతు ఇస్తుంటే మా కష్టానికి ఫలితం దక్కినట్టే” అని చెప్పింది. ఇక తన తల్లి, దివంగత నటి శ్రీదేవి గురించి ప్రస్తావిస్తూ, ప్రేక్షకులే దేవుళ్లు అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. అదే మాటను నేను కూడా నమ్ముతాను అంటూ భావోద్వేగానికి లోనైంది. కార్యక్రమంలో మరో ఆసక్తికర ఘట్టం కూడా చోటుచేసుకుంది. చిరంజీవి, శ్రీదేవి నటించిన క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లోని పాపులర్ డైలాగ్‌ను జాన్వీ చెప్పాలని కోరగా, ఆమె తనదైన శైలిలో ఆ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించింది. దీంతో సభలో చప్పట్లు, కేరింతలు మార్మోగాయి.