Janhvi Kapoor | బాలీవుడ్ లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్, ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. తల్లి అడుగుజాడల్లో నడుస్తూ నటిగా ఎదిగిన జాన్వీ, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ వైపు దృష్టి సారిస్తోంది. శ్రీదేవి సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్ళినప్పటికీ, జాన్వీ మాత్రం రివర్స్ ప్రయాణం చేస్తోంది. బాలీవుడ్లో ‘ధడక్’ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఆమె, టాలీవుడ్లో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో సత్తా చాటింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో జాన్వీకి దక్షిణాదిలో కూడా ఫ్యాన్‌బేస్ పెరిగింది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ జోడీగా ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంతో రూపొందుతుండగా, జాన్వీ అందులో గ్రామీణ యువతిగా కనిపించనుంది.
జాన్వీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగులో వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టులు ‘దేవర’, ‘పెద్ది ఆమెకు ఆ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా, ‘దేవర 2’ సెట్స్‌లో కూడా జాన్వీ త్వరలోనే అడుగుపెట్టనుంది. వ్యక్తిగత జీవితంలో కూడా జాన్వీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జంట అనేకసార్లు కలిసి డేటింగ్లో, విహారయాత్రల్లో, అలాగే తిరుపతిలో కూడా దర్శనమిచ్చారు. ఇప్పుడేమో జాన్వీ తాజా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అభిమానులను కన్ఫ్యూజ్ చేసింది. ఆమె తన ఇన్‌స్టాలో “Save the Date 29th Oct” అని పోస్ట్ చేయడంతో, సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఈ పోస్ట్ చూశాక చాలా మంది “జాన్వీ పెళ్లి చేసుకోబోతుందా?” అని ముచ్చటించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు జాన్వీ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ఏదేమైనా, అక్టోబర్ 29న జాన్వీ ఏమి ప్రకటించబోతోందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది సినిమా అనౌన్స్మెంట్నా, లేక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సర్ప్రైజ్నా అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.