కెరీర్ ఆరంభం నుంచి కథాంశాల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తుంది అందాల తార జాన్వీకపూర్. హిందీలో ఈ భామ నటించిన చిత్రాలన్నీ విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో ఈ భామ తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిలో తన తొలి చిత్రమిదే కావడంతో ఈ సినిమా గురించి జాన్వీకపూర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదట. తాజాగా ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. కథానాయకుడిని పట్టించడానికి రహస్య ఆపరేషన్ చేపట్టే గూఢచారిగా జాన్వీకపూర్ పాత్ర సాగుతుందని తెలిసింది.
కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లో ఈ భామ మత్స్యకారుల కుటుంబానికి చెందిన యువతిగా కనిపించనుందని చిత్ర బృందం పేర్కొంది. అయితే ఈ సినిమాలో రెండు భిన్న కోణాల్లో ఆమె పాత్ర సాగుతుందని, హీరోని ట్రాప్ చేయడానికే ఆమె మత్స్యకార యువతిగా కనిపిస్తుందని చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారం భంకానుంది.