Manjula Daughter | ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు వెండితెరపైకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. నటి, దర్శకురాలు మంజుల ఘట్టమనేని కుమార్తె టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు అయిన జాన్వీ స్వరూప్ ఘట్టమనేని త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా హీరోయిన్గా తన తొలి సినిమాను ప్రకటించకముందే జాన్వీ ఒక ప్రతిష్టాత్మక వాణిజ్య ప్రకటనలో కనిపించడం విశేషం. తాజాగా జాన్వీ కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ జువెలరీ బ్రాండ్ యాడ్‌లో నటించారు. తెరపై ఆమె నటించిన తొలి ప్రచార చిత్రం ఇదే కావడంతో ఈ యాడ్ ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తిని రేపుతుంది. బ్రాండ్ టీం ఈ యాడ్ కోసం జాన్వీ ఫొటోలను సోషల్ మీడియాలో చూసి సంప్రదించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన యాడ్ వీడియోను మంజుల యూట్యూబ్ వేదికగా పంచుకుంది.
గత ఏడాది జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె సినీ అరంగేట్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే హీరోయిన్గా అడుగుపెట్టక ముందే ఒక ప్రముఖ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించడం అనేది జాన్వీకి మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు త్వరలోనే ఆమె ఒక బడా ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌కు ఆమెను లాక్ చేశారని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.