Jana Nayagan | కోలీవుడ్లో భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’. ఈ చిత్రం పలు అనివార్య కారణాలతో నిలిచిపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా వాయిదా విషయాన్ని ప్రకటించడంతో అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. భారీ తారాగణంతో పాటు సాంకేతికంగా కూడా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మితమైంది. అనిరుద్ రవిచందర్ సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
ఈ సినిమాపై మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి నెలకొనడానికి మరో కారణం ఉంది. దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, ఇదే తన చివరి సినిమా అని ఆయన ప్రకటించడం. ప్రజల కోసం పనిచేయాలన్న లక్ష్యంతో టీవీకే పార్టీని స్థాపించిన విజయ్, సినిమాలకు వీడ్కోలు పలుకుతున్నారన్న వార్త అభిమానుల్లో భావోద్వేగాన్ని రేకెత్తించింది. అందుకే సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న ‘జన నాయగన్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.అయితే, సెన్సార్ ప్రక్రియలో ఏర్పడిన సమస్యలు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. సీబీఎఫ్సీ సూచనల మేరకు కొన్ని సన్నివేశాల్లో మార్పులు, డైలాగ్స్ మ్యూట్ చేయాల్సి రావడంతో చిత్రబృందం మళ్లీ రివ్యూకి పంపింది. కానీ, ఆ తర్వాత క్లియరెన్స్ ఆలస్యం కావడం, రివైజింగ్ కమిటీకి ఫైల్ వెళ్లడం వంటి పరిణామాలతో పరిస్థితి క్లిష్టమైంది. విడుదల తేదీ దగ్గరపడటం, కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవడం నిర్మాతలపై తీవ్ర ఒత్తిడిని తెచ్చింది.
ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి, జనవరి 9 ఉదయం వెల్లడిస్తామని తెలిపింది. అయితే, తీర్పు అనిశ్చితి మధ్యలోనే సినిమా విడుదల చేయడం సాధ్యంకాదని భావించిన నిర్మాతలు చివరకు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే చాలా మంది టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. మూవీ వాయిదా పడడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి డీఎన్సీ థియేటర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి రీఫండ్ ఇస్తామని ప్రకటించడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మిగతా థియేటర్స్ కూడా అలా రీఫండ్ చేస్తాయా లేదా అన్నది చూడాలి.