దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన విజువల్ వండర్ ‘అవతార్ ద వే ఆఫ్ వాటర్’ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తూనే ఉంది. ఈ సినిమా వసూళ్లు దాదాపు రెండు బిలియన్ డాలర్లకు చేరువవుతున్నాయి. దాదాపు 2 వేల కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ఖర్చుకు ఎనిమిది రెట్ల లాభాలు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో కేట్ విన్స్లెట్, సామ్ వార్తింగ్టన్, జోయో సల్డానా, సిగుర్నే వీవర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సిరీస్లో రాబోతున్న మూడో చిత్రం అగ్ని నేపథ్యంగా ఉండబోతున్నది. ఈ విషయాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ తాజాగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ…‘అవతార్ 3 కథ పాండోర గ్రహంలో మరో ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడి ఎడారిలో సంపదను కొల్లగొట్టేందుకు వచ్చే మనుషులతో జేక్ అతని కుటుంబ సభ్యులు ఎలా పోరాడారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సారి కథలో కొత్త తెగలను పరిచయం చేస్తాం, అగ్ని నేపథ్యంగా ఉంటుంది’ అని చెప్పారు.