Jailer Movie Collections | పుష్కర కాలం తర్వాత జైలర్‌తో హిట్టు కొట్టాడు రజనీకాంత్. రోబో తర్వాత ఇప్పటివరకు రజనీకి ఆ స్థాయి హిట్టు పడలేదు. మధ్యలో బాగా హైప్‌తో రిలీజైన ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ సినిమాలు బాగానే ఆడినా రజనీ స్థాయిలో బంపర్ హిట్టు కొట్టలేకపోయాయి. ఇక గతేడాది వచ్చిన పెద్దన్న రజనీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో రజనీ పనై పోయింది. సినిమాలకు ఇంకా సెలవు తీసుకుని టైమ్ వచ్చింది అని బోలెడు విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే జైలర్‌తో విమర్శకుల నోటితోనే ప్రశంసలు అందుకున్నాడు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనే రేంజ్లో సూపర్ స్టార్ జైలర్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్ మార్కెట్ ఉన్న తెలుగులోనూ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు.
తొలిరోజే దాదాపు రూ.90 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ పవరేంటో మరోసారి నిరూపించాడు. ఇక మూడు రోజుల్లోనే ఈ సినిమా రెండొందల కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. కేవలం మూడు రోజుల్లోనే రెండొందల కోట్ల మార్క్ టచ్ చేసిన తొలి తమిళ సినిమాగా జైలర్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలుగులోనూ ఈ సినిమాకు కలెక్షన్ ప్రవాహం కొనసాగుతుంది. రూ.12 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా తెలుగులో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఇదే జోరు కొనసాగితే డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు ఖాయం. రూ.100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరో పాతిక కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధిస్తే వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది.
ఆదివారంతో అది కూడా పూర్తవడం ఖాయం. పైగా మరో రెండు రోజుల్లో ఇండిపెండెన్స్ డే కూడా రానుంది. ఇది సినిమాకు చాలా ప్లస్ అయ్యే చాన్స్ ఉంది. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, ప్రియాంక అరుళ్మోహన్, కన్నడ స్టార్ శివరాజ్ వంటి స్టార్ కాస్ట్ నటించారు.