Jagapathi Babu | తెలుగు సినిమా ప్రేక్షకులని మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో అలరిస్తూ వస్తున్నారు జగపతిబాబు .వెండితెరపై విలక్షణమైన నటనతో ముద్ర వేసిన ఈ నటుడు ఇప్పుడు బుల్లితెరపై టాక్ షో హోస్ట్‌గా కూడా మారారు. జయమ్ము నిశ్చయమ్మురా అనే కొత్త టాక్ షోకు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.తొలి ఎపిసోడ్లో కింగ్ నాగార్జున సందడి చేశారు. అయితే జగపతి బాబు 1989లో “సింహాసనం” సినిమాతో సినీ రంగప్రవేశం చేసారు. 1990లలో ఫ్యామిలీ డ్రామాలు, ఎమోషనల్ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. “శుభలగ్నం”, “అంతఃపురం”, “పెళ్లికానుక” వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఆయన స్థానం బలపడింది.
2014లో వచ్చిన “లెజెండ్” సినిమాలో విలన్‌గా నటించి కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి “రంగస్థలం”, “సైరా”, “సలార్”, “అఖండ” వంటి హిట్ చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. జగపతిబాబు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటూ, తన కెరీర్ అప్డేట్స్, వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకుంటున్నారు.అయితే జగపతి బాబు తాజాగా తన యూట్యూబ్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆయన అసలు పేరు జగపతిరావు అని… కాకపోతే ఇండస్ట్రీలో రావులెక్కువైపోయారని… అందుకే తన పేరును జగపతిబాబుగా మార్చారని చెప్పుకొచ్చారు. అయితే అందరికీ నోరు తిరగడానికి ఈజీగా ఉంటుందని జగ్గూభాయ్ గా మారిపోయానని స్పష్టం చేశారు.
ఇక’అంతఃపురం’ సినిమాలో తాను దాదాపు చనిపోయానని అనుకున్నానని జగపతి బాబు చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కృష్ణవంశీ సీన్ లో లీనమై కట్ చెప్పకపోవడంతో… తాను నిజంగానే పోయాననుకున్నానని జగ్గూభాయ్ అన్నారు. అయితే తన కెరీర్ మొత్తంలో ఆ సినిమాలో క్లైమాక్సే తన ఫేవరెట్ షాట్ అంటూ జగపతి బాబు చెప్పడం విశేషం. ఇక తన జుట్టుకి రంగు వేసుకోమని చాలా మంది చెబుతుంటారు. కాని నాకు జట్టు ఉండడమే అదృష్టం అనుకుంటాను. అది సహజంగానే తెల్లబడింది కాబట్టి దానికి రంగు వేయకుండా అలాగే వదిలేశానని జగపతి బాబు అన్నారు. తనకు పెద్దగా కోరికలు ఏమి లేవని చెప్పిన జగపతి బాబు చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇందుకోసం ప్రతి రోజు ప్రాణామాయం చేస్తున్నానని అన్నారు.