Puri Jagannadh | అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శరణార్థుల ప్రాణాలను కాపాడడం కోసం ప్రముఖ డిజైనర్ ఏంజెలా లూనా తయారు చేసిన జాకెంట్ అనే డిజైన్‌కి సంబంధించి పాడ్ కాస్ట్లో మాట్లాడాడు.
ఈ మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా.. లేదా రకరకాల దరిద్రాల కారణంగా ఉన్న దేశాన్ని ఇంటిని వదిలిపెట్టి కట్టుబట్టలతో పెళ్ళాం పిల్లలను తీసుకొని వేరే దేశాలకు వలస పోతున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళంతా వేరే దేశాల్లో హోమ్ లెస్ పీపుల్. చాలా చోట్ల వలస జీవితాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా నైజీరియా, హోండరాస్, ఇరాక్, సూడాన్, ఇండియా, చైనా, ఇథియోపియా అలాగే అలాగే అమెరికాలో చూస్తే కాలిఫోర్నియా, న్యూయార్క్, ఫ్లోరిడా. ఇలా ప్రపంచమంతా ఇల్లు లేకుండా నివసిస్తున్నవారు ఉన్నారు. ఇండియాలో 4 కోట్ల మంది అడుక్కునేవాళ్లు ఉన్నారు. ప్రపంచ జనాభాలో 5 % ప్రజలకు ఇల్లు అంటూ లేదు. వీళ్ళ కష్టాలు వర్ణనాతీతం కొంతమంది వడదెబ్బ తగిలి చనిపోతున్నారు ఇంకొంతమంది చలికి తట్టుకోలేక చనిపోతున్నారు. ఇల్లు వాకిలి వదిలేసి ఒక మనిషి తనకు అవసరమైనవి మాత్రమే ఒక బ్యాగ్‌లో వేసుకొని బయలుదేరాల్సి వస్తే.. ఆ బ్యాగ్‌లో ఏం వేయాలో తెలియదు. దేనిని వదులుకోలేం. అలాంటి బ్యాగ్ చాలా బరువుగా ఉంటుంది. అలాంటి బ్యాగ్ పట్టుకుని నడవాలంటే ఎంత కష్టం. దుస్తులు, గిన్నెలు, స్టవ్ అవే చాలా బరువు ఉంటాయి. ఆఖరికి దుప్పటి పట్టుకెళ్లాలన్న కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. అలాంటిది షెల్టర్‌ను ఎలా మోస్తాం? ఇక టెంట్‌ను మోసుకువెళ్లే పరిస్థితి అసలు ఉండదు. ఇలా షెల్టర్ లేకపోవడం వల్ల రోజు ఎంతో మంది ప్రపంచంలో చనిపోతున్నారు.
Jackent
ఇలాంటి ఇల్లు లేని వారందరి కోసం ఒక అద్భుతమైన డిజైన్ చేసింది న్యూయార్క్ కి చెందిన ఒక డిజైనర్ ఏంజెలా లూనా (Angela Luna). దాని పేరు జాకెంట్(Jackent). జాకెట్‌ను, టెంట్‌ను కలిపి చేసిన డిజైన్ ఇది. దీనిని జాకెట్లా వాడుకోవచ్చు ఉండడానికి పడుకోవడానికి టెంట్‌గా వాడుకోవచ్చు. ఈ జాకెంట్ ఎంతో మంది సిరియా శరణార్థులను కాపాడింది. చాలా మంది డిజైనర్లు సెలబ్రిటీలు, డబ్బున్న వాళ్లకోసం కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. వాటన్నింటి కంటే గ్రేట్ డిజైన్ ఇది. ఇది ఎంతో మంది ప్రాణాలు కాపాడిన డిజైన్ ఇది. ఈ జాకెంట్ని డిజైన్ చేసినందుకు ఏంజెలాని మనమందరం ప్రశంసించాలి. అతి తక్కువ ధరకు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది ఈ డిజైన్. ఇండియాలో ఈ డిజైన్ ఇంకా రాలేదు. త్వరలోనే రావాలని కోరుకుంటున్నా. అడుక్కునేవాళ్లకి దుప్పట్లు, ఆహారం పంచే ఎంతో మంది మంచి మనుషులు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి జాకెంట్స్ (Jackent) వస్తే, వాళ్లకు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఈ జాకెంట్లని ఇల్లు లేని వాళ్లకి మాత్రమే కాదు.. మనం కూడా క్యాంపింగ్ వేసుకోవడానికి వాడుకోవచ్చు. ఏదైన కంపెనీ వీటిని ఇండియాలో పరిచయం చేయాలని నా ఆశ. లేదా ఇదే ఐడియాను తీసుకుని తయారు చేసినా హ్యాపీ. దీని వలన ఎంతో మందిని కాపాడిన వాళ్లు అవుతారు. త్వరలోనే జాకెంట్ ఇండియాలో దొరుకుతుందని ఆశిస్తున్నా అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకోచ్చాడు.