Jaat Movie | బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం జాట్ (Jaat). ఈ చిత్రానికి క్రాక్, వీరా సింహ రెడ్డి చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్లో మిక్సడ్ టాక్‌ను సొంతం చేసుకోగా.. బాలీవుడ్లో మాత్రం సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా రూ.120 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి (Jaat movie ott) వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ ఆంధ్రప్రదేశ్ లోని మోటుపల్లి.. ఆ చుట్టుపక్కల గ్రామాల చూట్టు తిరుగుతుంది. అక్కడ ఉన్న ప్రజలకు రణతుంగ (రణదీప్ హుడా) అతడి తమ్ముడు సోములు (వినీత్ కుమార్‌సింగ్) అంటే చచ్చేంత భయం. వారి కన్ను దేని మీద పడినా, అది కచ్చితంగా వారికి దక్కాల్సిందే. వారి మాటకు ఎదురనేదే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో, జాట్ (సన్నీ డియోల్) ప్రయాణిస్తున్న ఒక రైలు అనుకోకుండా మోటుపల్లి మీదుగా వెళ్తూ ఆగిపోతుంది. రైలు రిపేర్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని టీటీ చెప్పడంతో, జాట్ ఆకలి తీర్చుకోవడానికి పక్కనే ఉన్న ఓ హోటల్‌కి వెళ్తాడు.
సరిగ్గా అదే సమయంలో, కొందరు రౌడీలు ఆ హోటల్లోకి వచ్చి గొడవ సృష్టిస్తారు. ఆ గందరగోళంలో, జాట్ తింటున్న ఇడ్లీ ప్లేట్‌ను కింద పడేస్తారు. దీంతో ఒళ్లు మండిన జాట్, వాళ్లు సారి(క్షమాపణ) చెప్పాల్సిందేనంటూ గట్టిగా నిలదీస్తాడు. కానీ రౌడీలు వినకపోవడంతో, వాళ్లను చితకబాదుతాడు. ఈ పంచాయితీ క్రమంగా పెద్దదై, చివరికి రణతుంగ ఇంటికి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళాక జాట్‌కు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అసలు రణతుంగకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి జాట్‌కు ఎందుకు వచ్చింది? ఇంతకీ రణతుంగ, జాట్ల గతం ఏమిటి? వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథ.