Actor Arya | ప్రముఖ తమిళ నటుడు ఆర్య నివాసంతో పాటు.. ఆయనకు సంబంధమున్న వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నేడు ఆకస్మిక దాడులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ‘సీ షెల్’ రెస్టారెంట్ల శాఖల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయని సమాచారం. ఆర్య తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, సక్రమంగా పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న ‘సీ షెల్’ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖల్లో బుధవారం ఉదయం నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్‌ను ఆర్య గతంలో కేరళకు చెందిన వ్యాపారి కున్హి మూసాకు విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ కేరళ వ్యాపారి ఆస్తులపై ఇప్పటికే ఐటీ శాఖ నిఘా పెట్టిందని, ఈ విచారణలో భాగంగానే చెన్నైలోని ఈ రెస్టారెంట్లు, ఆర్య నివాసంపై దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఈ లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
అయితే, తనిఖీలు జరుగుతున్న ‘సీ షెల్’ రెస్టారెంట్లు తన స్వంతం కాదని ఆర్య పేర్కొన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఐటీ శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది.