Ahimsa Movie | టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఒక పుస్తకం అయితే అందులో ఒక పేజీ రామానాయుడికి సొంతం. తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. మూవీ మొగల్‌గా ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. ఆయన లెగసీని అటు సురేష్ బాబు, ఇటు వెంకటేష్ కంటిన్యూ చేశారు. వెంకటేష్ తర్వాత దగ్గుబాటి నట వారసత్వాన్ని రానా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు అదే దారిలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. ఆయనే సురేష్ బాబు రెండో కొడుకు, రానా తమ్ముడు అభిరామ్. తేజ దర్శకత్వంలో అభిరామ్ అహింస అనే యాక్షన్ ప్రేమకథా చిత్రాన్ని చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తుంది. అయినా ఇంకా రిలీజ్‌కు నోచుకోలేకపోతుంది. అప్పుడస్తుంది.. ఇప్పుడొస్తుందంటూ విడుదల తేదీలు ప్రకటించినా.. పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాత కొడుకు సినిమా రిలీజ్‌కు ఇన్ని కష్టాలేంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎట్టకేలకు ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకులు ముందుక రాబోతున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. కాగా సినిమా రిలీజ్‌కు పట్టుమని వారం రోజులు కూడా లేదు. కానీ ఇంకా ప్రమోషన్ల ఊసు లేదు. ఇంతకీ సినిమా రిలీజవుతుందా లేదా అనేది కూడా ఎలాంటి క్లారిటీ లేదు.
అహింస సినిమాకు నిర్మాత వేరొకరైనా.. రిలీజ్ చేస్తుంది మాత్రం సురేష్ బాబే. అలాంటప్పుడు ప్రమోషన్లు ఏ రేంజ్లో జరపాలి. కానీ వాటి జాడే లేదు. ఒక సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే సురేష్ బాబు తర్వాతే ఎవరైనా అనేది ఇండస్ట్రీలో టాక్. అంతేకాకుండా సురేష్ బాబు ప్రమోషన్ల స్ట్రాటజీను ఎంతో మంది ఫాలో అవుతుంటారని కూడా సమాచారం. అలాంటిది కొడుకు సినిమాకు చప్పుడే లేదంటే కారణం ఏమయ్యుంటుందనేది అందరిలోనూ మెదలుతున్న ప్రశ్న. ఇక రానా సైతం ఈ సినిమాపై సైలెంట్‌గానే ఉన్నాడు.
ఇప్పటివరకు రిలీజైన టీజర్లు, ట్రైలర్లు గట్రా సినిమాపై ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేయలేవు. పైగా అదే రోజున రావణాసుర విడుదల కానుంది. ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో ఇటు సినీ సెలబ్రెటీల్లో సైతం ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. అదీ కాకుండా మొన్న రిలీజైన దసరా బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తుంది. ఈ ఊపు మరో రెండు మూడు వారాలు ఉండేటట్లు కనిపిస్తుంది. ఇలాంటి టైమ్‌లో అహింస రిలీజ్ చేయడం సరికాదని మేకర్స్ సైలెంట్‌గా ఉంటున్నారా? లేదంటే మరో కారణమా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.