Indian-2 Movie | ఇండియాలోని గొప్ప దర్శకుల లిస్ట్ తీస్తే అందులో శంకర్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లిపోతుంటారు. సమాజంలోని లోపాల్ని వేలెత్తి చూపిస్తూనే కమర్షియల్ హంగులను బాగా దట్టించడంలో శంకర్ సిద్ధ హస్తుడు. శంకర్ ఓ వైపు సోషల్ మెసేజ్ ఇస్తూనే మరోవైపు కావలిసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తాడు. అయితే గతకొంత కాలంగా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నాయి. నిజానికి రోబో తర్వాత శంకర్ ఇప్పటివరకు ఆ స్థాయి విజయం సాధించలేకపోయాడు.
ప్రస్తుతం ఆయన రెండు ప్రాజెక్ట్‌లను సెట్స్ మీదుంచాడు. అందులో ఒకటి రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ కాగా.. మరోటి కమల్ భారతీయుడు-2. ఈ రెండు సినిమా షూటింగ్‌లను శంకర్ ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇండియన్-2 ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో రామ్‌చరణ్ సినిమా కంటే ముందే ఇండియన్-2 సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో ముందు నుంచి రామ్‌చరణ్‌కే అనుకుంటున్న సంక్రాంతి పండగ కాస్త కమల్‌కు షిఫ్ట్ అయింది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, ఈ వార్త మెగా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. అయ్యో శంకర్ ఏంటీ ఇలా చేశాడు అంటూ పలువురు మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇటీవలే ఎస్ఎస్ఎమ్బీ28 సినిమా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కాగా ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తుంది దిల్‌రాజే. దీన్ని బట్టి చూసిన సంక్రాంతి బరిలో నుంచి గేమ్‌ఛేంజర్ సినిమా తప్పుకున్నట్లు స్పష్టం అవుతుంది. ఇక తాజాగా చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టైటిల్ పోస్టర్, ఫస్ట్‌లుక్ పోస్టర్లు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కియరా అద్వాణి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, ఎస్.జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇక భారతీయుడు విషయానికొస్తే ఇటీవలే మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికే 75శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని తమిళ మీడియాల సమాచారం. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.