అగ్ర నటుడు కమల్‌హాసన్ సినిమా అంటే కథాపరంగా తప్పకుండా వైవిధ్యం ఉండాల్సిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ చిత్రంలో నటిస్తున్న ఆయన అనంతరం మణిరత్నం, హెచ్.వినోద్ దర్శకత్వం వహించే సినిమాలు చేయబోతున్నారు. ఇందులో హెచ్. వినోద్ సినిమా కమల్‌హాసన్ 233వ చిత్రంగా తెరకెక్కబోతున్నది. రైతు సమస్యలను చర్చించే సామాజిక కథాంశమిదని, కమల్‌హాసన్ రైతు పాత్రలో కనిపిస్తారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇదని తెలిసింది. సైనికుల త్యాగం, దేశభక్తి అంశాల చుట్టూ భావోద్వేగభరితంగా కథ నడుస్తుందని చెబుతున్నారు. ఇటీవల సోషల్‌మీడియా ద్వారా బయటికొచ్చిన ఓ వీడియోలో కమల్‌హాసన్ గన్‌ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసే సినిమా కోసమే ఆయన ఫైరింగ్‌లో శిక్షణ తీసుకున్నారని తెలిసింది. ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ పాత్ర కోసం కమల్‌హాసన్ ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారని సమాచారం. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.