Balakrishna Son | నందమూరి మూడో తరం వారసులుగా ఇప్పటికే తారక్, కళ్యాణ్‌రామ్‌లు ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవళ్లుగా పేర్లు సంపాదించుకున్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి ఇంకో మనవడు జాయిన్ కాబోతున్నాడు. అతడే మోక్షజ్ఞ తేజ. నందమూరి లెగసీని మరో మెట్టు ఎక్కించే సత్తా ఉంది మోక్షజ్ఞ తేజకే అని నందమూరి అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఆయన ఎంట్రీ గురించి చర్చలు జరగని రోజు లేదు. ఇప్పుడొస్తాడు.. అప్పుడొస్తాడంటూ కళ్లలో వత్తులు వేసుకుని చూడటమే తప్ప నందమూరి వారసుడి రాకకు సరైన ముహూర్తం కుదరడం లేదు. కొడుకు ఎంట్రీ కోసం బాలయ్య గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే పలువురు దర్శకులను లైన్లో పెట్టాడని.. అన్నీ కుదిరితే అతి త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే రెండు రోజుల నుంచి ఓ రూమార్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఇటీవలే భగవంత్ కేసరి సెట్లో మోక్షజ్ఞ కనిపించాడు. అనీల్ రావిపూడి, శ్రీలీలతో కబుర్లు చెప్పుకున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. కాగా మోక్షజ్ఞ కేవలం సెట్‌ను విజిట్ చేయడం కోసం రాలేదని, ఈ సినిమాలో ఓ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడని ఓ రూమర్ హల్ చల్ చేస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో శ్రీలీలను కాపాడే సీన్లో రెప్పపాటు కనిపించబోతున్నాడని రూమర్లు చెట్టిక్కి కూర్చున్నాయి. ఇందులో నిజమెంతుంతో ఆ భగవంతుడికే తెలియాలి. అలా అని ఈ రూమర్‌ను కొట్టిపారేయలేం. గతంలో అఖిల్ కూడా మనం సినిమాలో ఓ రెప్పపాటు కనిపించి అక్కినేని అభిమానులతో ఈలలు వేయించుకున్నాడు.
ఇప్పుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తే మట్టుకు నందమూరి అభిమానులను పరిచయం అయినట్లు ఉంటుంది. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వీలైనప్పుడల్లా తండ్రి బాలయ్య నటిస్తున్న సెట్స్‌లో దర్శనమిస్తున్నాడు. ఆ మధ్య వీరసింహా రెడ్డి సెట్లోనూ మోక్షజ్ఞ సందడి చేశాడు. అయితే అదే టైమ్‌లో మోక్షజ్ఞ భారీ కాయాన్ని చూసి నందమూరి అభిమానులు సైతం పెదవి విరిచారు. సర్జరీ చేయించుకున్నాడో లేక కష్టపడి తగ్గాడో కానీ నెలల గ్యాప్‌లోనే సన్నగా మారి హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇక ఇటీవలే నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్లోనూ మోక్షజ్ఞను చూసి బాలయ్య ఫ్యాన్స్ మురిసిపోయారు.