Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా, విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి మంచి స్పందన అందుకుంటూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వివాదం కొనసాగుతున్నప్పటికీ.. కలెక్షన్ల జోరుపై మాత్రం దాని ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణలోని నైజాం మార్కెట్లో ‘ఇరుముడి’ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలి వారంలోనే తెలంగాణ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడు రోజుల ముగిసేసరికి నైజాం ఏరియాలో సుమారు రూ.26 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు సమాచారం.
సాధారణ వర్కింగ్ డే అయిన ఏడో రోజున కూడా తెలంగాణలో దాదాపు రూ.3 కోట్ల మేర వసూళ్లు నమోదు కావడం సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాంగ్ వీకెండ్ ‘ఇరుముడి’కి మరింత కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం వరకు అదనంగా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉండటంతో, తెలంగాణలో రూ.70 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడంపై అంచనాలు పెరుగుతున్నాయి. ‘ధమాకా’ తర్వాత రవితేజ కెరీర్లో ఈ స్థాయిలో మాస్ రీచ్, కలెక్షన్ల జోరు కనిపిస్తున్న చిత్రం ‘ఇరుముడి’ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రవితేజ ఎనర్జీ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర నటనతో పాటు శివ నిర్వాణ దర్శకత్వం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ఇక సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాట చార్ట్‌బస్టర్‌గా మారి ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లోనూ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ.. నైజాం మార్కెట్లో నమోదవుతున్న రికార్డు స్థాయి వసూళ్లు ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే పలు థియేటర్లలో హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో దూసుకుపోతున్న ‘ఇరుముడి’.. ఈ లాంగ్ వీకెండ్ ముగిసే నాటికి ఇంకెన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. రవితేజ అభిమానులు మాత్రం ఈ విజయాన్ని ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.