Homebound Short List For Oscars | భారతీయ సినిమా కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరింది. బాలీవుడ్ దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్‌బౌండ్’ (Homebound) చిత్రం ప్రపంచ సినీ వేదికపై సత్తా చాటుతోంది. 2026లో జరగనున్న 98వ అకాడమీ అవార్డుల (Oscars) రేసులో ఈ సినిమా ఒక అడుగు ముందుకు వేసి, ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయ్యింది. ఈ ఏడాది ఆస్కార్ పోటీకి ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల నుంచి సినిమాలు ఎంట్రీలు పంపగా, అకాడమీ సభ్యులు కేవలం 15 చిత్రాలను మాత్రమే తదుపరి దశకు ఎంపిక చేశారు. ఇందులో భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన ‘హోమ్‌బౌండ్’ నిలవడం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ సినిమా కథ ఇషాన్ ఖట్టర్ మరియు విశాల్ జెత్వా పోషించిన ఇద్దరు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వారు ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ, సమాజంలో గౌరవం పొందాలని, తమ కుటుంబాల కష్టాలను తీర్చాలని పోలీసు అధికారులు కావాలని కలలు కంటారు. దానికి కావాల్సిన శిక్షణ కోసం వారు పడే శ్రమ, వారి మధ్య ఉండే గాఢమైన స్నేహం ఈ సినిమాకు ప్రాణం పోసింది. అయితే ఈ వీరిద్దరిలో ఒకరు మైనారిటీ వర్గానికి మరోకరు తక్కువ కులానికి చెందడంతో సమాజంలో వివక్షను ఎదుర్కోంటారు. అయితే చివరికి వీరి జీవితంలో ఏం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సామన్య ప్రజలను పట్టించుకోకుండా కరోనా టైంలో లాక్ డౌన్ విధించడంతో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది ఈ సినిమా కథ. అలాగే ప్రస్తుతం ఇండియాలో ఇతర కమ్యూనిటీలపై విద్వేషం ఎలా పెరుగుతుందో కూడా చూపించాడు దర్శకుడు. ఈ చిత్రం ఇప్పటికే ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రం ఆస్కార్‌కి నామినేట్ అవ్వడంపై ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించిన కరణ్ జోహార్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. “ఇది మా సంస్థకు దక్కిన అతిపెద్ద గౌరవం. ఒక స్వచ్ఛమైన భారతీయ కథకు ప్రపంచం నీరాజనాలు పలుకుతున్నందుకు గర్వంగా ఉంది” అని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. గతంలో ‘RRR’ చిత్రం ద్వారా ఆస్కార్‌ను ముద్దాడిన భారత్, ఇప్పుడు ‘హోమ్‌బౌండ్’ ద్వారా మరోసారి చరిత్ర సృష్టించాలని దేశమంతా ఆశిస్తోంది.
Homebound has been shortlisted for Best International Feature Film at the 98th Academy Awards. We’re deeply grateful for the extraordinary love and support we’ve received from around the world.🙏🏻 pic.twitter.com/MVIJMJAlvr
— Dharma Productions (@DharmaMovies) December 16, 2025